Tuesday, October 29, 2013

నీ ప్రేమకై


అసలెందుకో...? ఈ కలవరం.
 చిగురించే ఆశలకు  వేదికగా
వింత అలజడులకు ఆహ్వానం.

 పలుకరిస్తున్న ప్రతీ తలపు,
నీ సాహచర్యంలో గడిపిన క్షణాలను
మోసుకొస్తుంటే....
వాటిని  అస్వాధిస్తున్న నా  మనసు,   
 కొత్త  తీరానికి  గమ్యం వెదుకుతూ..
గుర్తించింది  ఆ తీరం నువ్వేనని,
వెదకుతున్న నా  గమ్యం నీ ప్రేమే అని.
కాదేమో అని నా  మదిని వారిస్తుంటే..
 నేనే  సాక్ష్యం అంటూ..
నన్ను ఒక్కడినే ఒంటరిగా వదిలించుకుని,
రెప్పపాటులో రెక్కలు విప్పుకుని
ఎగిరిపోతోంది.........
ఆకాశమంత ఎత్తున దాచుకున్న నీ ప్రేమకై.Thursday, April 18, 2013

నా మది మౌనరాగం...

ఒక ప్రియుడు తన చెలి స్పందనకై నిరీక్షిస్తూ.. ఉన్నప్పుడు, అలా  మొదలయిన తన మదిలోని మౌనరాగం ..   

నా మనసున పుట్టిన మౌనరాగం 
చెలియా..   నీకు వినబడునా..?
నా  తుది శ్వాస  విడిచేలోగా.  
నాలో కలిగిన అలజడి నీకు తెలిసేనా..? 
నా హృదయ స్పందన అగేలోగా.

నా మదిలో దాచిన  జ్ఞాపకాల బొండు మల్లెలు ..
నీ సిగలో చేరాలని ఆరాటపడుతున్నాయి.
 నా చేతులు నీ రూపం  గీసిస్తునప్పుడు.. 
ఈ వెన్నల జాబిలి చేయి కలయిక ఎప్పుడు ..?
అని నన్ను ప్రశ్నిస్తున్నాయి.
నా కనురెప్పల  వెనుక దాగిన స్వప్నాలు....  
నీ ఒడి  చేరాలని తపిస్తున్నాయి.  

నీపై నా  ప్రేమను ఏంతా?  అని చెప్పమంటే..
దానిని దాచలేని నా ఇరుకు ఎద చెబుతుంది
అది అంతులేని  మహా సాగరమని. 
నీకై  కనురెప్ప వేయకుండా ఎదురుచూసిన క్షణాలకు తెలుసు 
అవి  ఎంత మధురాతిమధురమని. 

ఓ నా ప్రియతమా..... 
నా మది  తలుపు తెరచి నీకై నీరిక్షిస్తూ.. ఉంది 
నీతో గడిపే  మధుర క్షణాల కోసం.  
ఈ నీరిక్షణ ఎన్నాళ్ళు?  అని అంటే..... 
నిన్ను ప్రేమించడానికి సరిపోని ఈ  జీవితం అంటుంది
ఎన్ని జన్మలకైనా  అని. 
Thursday, April 11, 2013

కూసంత.... హాస్యం....

వికసించిన  పువ్వులాంటి  పుట్టుక  ... వెదజల్లు పరిమళమే   ఈ జీవితం.. అలాంటి నా జీవితంలో... "కూసంత.... హాస్యం...." మీ కోసం..:-)              


              నాకు   జీవితంలో చాలా...ఇష్టమైన వాటిల్లో   ఆదివారం ఒకటి. ఆదివారం అనగానే ఏదో తెలియని  బద్ధకం, కాని.... నేను ఆ  రోజు కూడా ఎదో  ప్రొద్దున్నే  లేవాలనే అత్యాశతో అలారం 8 గంటలకె  పెట్టాను... అలా అని  మనకేమి ఇది కొత్త విషయం కాదు కదా! దాన్ని ఆఫ్ చేసి అంతే ఆవేశంగా టైమ్ దొరకనట్టు   నిద్రపోవడం..!  టైమ్  చూస్తే 10 గంటలు  అయింది, నేనే లేచాను అనుకుంటున్నారా ఏంటి.. ?అలా అనుకుంటే మీ పొరపాటే  నా ఫ్రెండ్ "బుజ్జిగాడు"  ఫోన్ కాల్ .... అ "దేవుడు" కి నాపైన ఎంత కోపం....? నేను నిద్రపోవడం చూసి అస్సలు తట్టుకోలేడు  ఎంతైనా మనం అ  "దేవుడు చేసిన మనషులు"మే కదా! ఈ ఒక్క సారి అ దేవున్ని క్షమించెస్తాలె. ఇంతకి మా వాడి ఫోన్ విషయం ఏంటంటే ... "ఎటో  వెళ్లి పోయింది మనసు" టికెట్స్ మాట్నీకి  బుక్ చేశానురా అని చెప్పాడు,నే సినిమా చూడకపోతే నాని,సమంత ఫీల్ అవుతారని  సరేరా అని చెప్పేసా. నేనేమో "బిందాస్"గా ఒంటి  గంటకు లేచాను నా రూంమేట్  "చింతకాయల రవి "గాడేమో 'నమ్మక తప్పని నిజమైన ....'  అంటూ "బొమ్మరిల్లు" సాంగ్ ప్లే చేస్తే నాకేమో అది   'నమ్మక తప్పదు   ఈ రోజు....ఇంత తొందరగా నే లేచానా.....'అన్నట్లుగా వినిపిస్తుంది... 
                
                 అప్పుడే  నా ఫ్రెండ్ "శత్రువు" గాడి ఫోన్, మేము "దిల్ సే " థియేటర్లో  వెయిట్ చేస్తున్నాము.. "స్వామీ రారా" అని ,నెనేమో  ఇక్కడ "గణేష్"  సెంటర్ లో  ఉన్నాను ఒక అరగంటలో మీముందు ఉంటారా అని ఏదో  "కథ" వినిపించా.. నానా అవస్థలు పడి "రెడీ" అయ్యి  "బస్ స్టాప్" లో ఓ పావుగంట  వెయిట్ చేస్తే .... అమ్మో అదేంటి  నాకు కావాల్సిన "143" నెం. బస్సు అపుడే వచ్చేసింది  నా జీవితంలో ఇదే మొదటిసారి కాబోలు ఇంత తొందరగా బస్సు రావడం ఈ రోజేదో  "అదృష్టం"  బావుంది అని నాలో నేననుకుంటూ బస్సు ఎక్కాను....అదేంటో మరి! "ప్రేమ కావాలి "  అనేంతల ఓ "అందాల రాక్షసి" నా కంటి ముందు మెరిసింది... ఇంతలో 'ఓ ప్రియా... ప్రియా....' అంటూ "ఇష్క్ "లో సాంగ్ నా మనసులో అలా  "అలా...మొదలైంది..... "దీనికి కారణం ఎంటా అని  ఆలోచిస్తే "ఎందుకంటే....  ప్రేమంట!" ...అ .. మరే!

                     మళ్లీ  ఎక్కడ ఉన్నావురా...?  షో టైం అవుతుంది అని..మంచి టైం కి నా ఫ్రెండ్స్  "జఫ్ఫా"స్  ఫోన్ కాల్స్.. అంతలో నా మదిని దోచిన "టక్కరి  దొంగ" మిస్ అయింది .... 'జీవితం అనే బస్ లో  ఎంతోమంది ఎక్కుతుంటారు... దిగుతుంటారు...'  అనే చిన్న  వేదాంతంతో సరిపెట్టుకుంటే "పోయే .. పోయే...లవ్వే... పోయే..." అంటూ పక్క వాడి ఫోనులో "ఆర్య-2" సాంగ్ రింగ్ టోన్ నన్ను వెక్కిరించినట్టుగా...! ఇంక నన్నునేను సముదాయించుకొని  థియేటర్ కు వెళ్ళాను... అక్కడ   Excuse me! కొంచెం సైడ్ ఇస్తారా...ప్లీజ్.... అంటూ వెనుకనుంచి ఓ అందమైన అమ్మాయి చూస్తే "గుండె ఝల్లుమంది"   నా "ప్రేమ దేశం"   యువరాణి మళ్లీ  నా కనుల ముందుకొచ్చింది,,, "నువ్వొస్తానంటే  నేనొద్దంటాన!" అని నా మదికి  అనిపించేలా..! ఇలాంటి మధురక్షణాలు మళ్ళి దొరకవు అన్నట్లుగా    నేను చిన్నగా అప్పుడే మాటలు కలిపాను  మా మద్య  మాటలు  బాగా కలిశాయి  ఎంతగా  అంటే...? "కుదిరితే కప్పు కాఫీ" అనేంతగా!  మూవీ  అయిన  తర్వాత  "సరదాగా కాసేపు" కబుర్లు చెప్పుకుంటూ కాఫీని ఎంజాయ్  చేస్తూ...."అవును"  ఇంతకీ  నీ పేరు ఏంటి అని అడిగింది.. ప్రేమ్  అని చెప్పాను  మరి నీ పేరు ప్రియ అని చెప్పింది.... "ప్రియ ప్రేమలో ప్రేమ్" బాగా సెట్ అయింది  కదూ!"100%లవ్"లో అంతే మరి!

                     ఇంతలో ఫోన్ మోగుతుంది.... చూస్తే ఫ్రెండ్ "ఏక్ నిరంజన్ " గాడు , 'ఏంట్రా ... బాబు! మద్యలో   నీ నస,,,,?' అనుకుంటూ ఫోన్ ఎత్తాను వాడేమో  షో టైం అవుతుంది తొందరగా  లేరా  బాబు..అన్నాడు, ఒక్కసారి  చుట్టూ  చూశాను..అమ్మో ! టైం చుస్తే మధ్యాహ్నం 1:30 అవుతుంది. అరె! నేనేమో  ఇంకా బెడ్ పైనే  ఉన్నానే...!ఓ  జరిగిదంతా  "స్వప్న లోకం"లోనా...  హ్హి..హ్హి.. హ్హి ...!  అపుడు ఇంకా నేనేమో 'నిజంగా... ఇదంతా.. కలనే.. అలా..నీతో..కాఫీ..తాగడం... .' అంటూ   "కొత్త బంగారు లోకం" లో  సాంగ్ ని రీమేక్ చేసి "కొంచెం ఇష్టం  కొంచెం కష్టం"గా పాడుకున్నా...నాలో నేను నవ్వేసుకుంటూ .....!  "ప్రేమలో పడితే " అంతేనెమో.."లైఫ్ is బ్యూటిఫుల్ " అనిపిస్తుందేమో!నిజంగా అలాంటి  "హ్యాపీ డేస్"  కోసం  ఈ "ప్రేమ లోకం"లో    నీరీక్షిస్తూ....మీ ప్రేమ్......      

                   

                

Tuesday, April 9, 2013

నా నేస్తమా..!

                రోజూ ఎంతోమందిని కలుస్తాము.... కానీ అందులో ఎవరో ఒక్కరే... మన  మనసుకు మంచి ఆప్తులు అవుతారు....అలాంటి స్నేహం  కలిసినపుడు నాకు, నా మదికి జరిగిన సంభాషణ నుండి వెల్లువైనా  భావాలను  కవితగా  మలిచిందే!  ఈ  "నా నేస్తమా .....!"  

మేఘంకరిగి చినుకుగా  మారి నేలను తాకినట్లు
అనుభవాలు కరిగి మధురక్షణాలై 
నన్ను తడిమే ఈ క్షణం..... 
ఎన్నో  మధురానుభూతులు మదిని స్పృశిస్తూ  
   కనులు అమృత ధారలు కురిపిస్తూ.. 
 నా మదిలోని  ప్రపంచం నాకు  తెలియనివిగా మారాయి నేస్తమా! 
నిన్ను కలిసిన ఈ క్షణం ...... 

ఆనంద జలపాతాలపై ఎగసి 
చిలిపి సంతోషాల  జాడల కోసం..
తలపించనే నా మది పదే పదే. 
ఎందుకు నేస్తం... ?నీ పరిహాసాలు .. . 
మనస్సుతోనే నీ చిలిపితనం
ఆశల సంద్రంలో నా  మదిని విహరింపచేస్తూ... ?
కదిలించే అలల స్వప్నాలు ..
వెల్లువలై సాగే ప్రవాహాల ఆలోచనలు.. 
మదినే కవ్వించే కలవరాలు.. 
మనసుకు అర్థం కానీ చేరువలు... 
ఇలా ఎన్నో మైమరిపించే తలపులు  
 నాలో మెరిసే నిన్ను కలిసిన ఈ క్షణం... 
గాలిలా నీరులా తీరం తెలియని  బాటసారికి 
కలిశావె తీరమల్లె నా  నేస్తమా .....!