Sunday, December 7, 2014

హేమంతం


 

మంచు పూల పల్లకిలో
అందంగా ముస్తాబయిన హేమంతం..
తన సోయగాలతో మనసును తడుముతూ
తనువంతా చక్కిలిగింతలు పెట్టి నవ్వుతుంది.


ఏమని వర్ణించనూ..?
రేయంచు నుంచి జారిపడిన వేకువఝాములో
పూలకొమ్మను హత్తుకుపోయిన నీటిముత్యాలను.
తూరుపు కొండలని దాటివస్తున్న సూరీడిని
మసకతెర చాటునుంచి తొంగిచూస్తున్న ఈ లోకాన్ని.


హేమంతమా!

నీ కౌగిట్లో వణుకుతున్న అక్షరాల్ని
ఒడిసిపట్టలేక అలిసిపోతున్న ఈ క్షణాల్లో..
వర్ణాతీతమైన నిన్ను బంధించాలనుకున్న
నాలోని కవిత్వం,ఓటమిని ప్రేమగా ముద్దాడింది.


Thursday, November 27, 2014

ఈ క్షణమే తేల్చి చెప్పవా సఖీ...నువ్వు....
వలపు సంకెళ్ళతో ఊహల గువ్వల్ని బంధించి,
నా చిట్టి గుండెగూటిలో నిలుపగల మంత్రగత్తెవు కదా!
అయితే,నాలో నీ జ్ఞాపకాల బలమెంతో చెప్పగలవా?
నాలోని కవ్వింతల తుఫాన్‌ను ఆపగలవా?
నాకు తెలుసు,వాటికి నీ దగ్గర మంత్రాలుండవని.

మరి నీకు తెలుసా..?

నువ్వు నడిపించుకెళ్ళిన దారుల వెంట,
రాలిపడిన అనుభూతుల పూవుల పరిమళమేదో
నా మనసుని ఎన్నటికీ వెంటాడటమాపదని.

నాలో నువ్వేసిన ఆశల పందిరిని,
ఘాడంగా అల్లుకుపోయిన నీ తలపుల తీగలు
కొంగొత్త కోరికలను చిగురిస్తూ ఎప్పటికీ వాడిపోవని.

కానీ,నాలో ఏ మూలనో ఓ చిన్ని సందేహం,
నువ్వు నా ప్రణయగీతాన్ని ఆస్వాధిస్తావో లేదో అని?!

ఈ క్షణమే తేల్చి చెప్పవా సఖీ...

నా ఆకాశమంత ప్రేమలో,
జాబిలమ్మవై వెన్నల వెలుగులీనుతావని!
తోకచుక్కలా నేలరాలిపోవని!!


Saturday, November 22, 2014

ఒక్క ఆశఅతడు ఆకాశాన్ని మింగేసే చూపులతో
వెన్నలను తాగాలని ప్రయత్నిస్తున్నాడు.
రైలు కిటికీ పక్కన కూర్చున్నాతడికి
చలికి వణుకుతున్నట్లున్నాయి నక్షత్రాలు.

అతడి ప్రియసఖి ఆఖరిసారి
జ్ఞాపకంగా ఇచ్చిన కాఫీమగ్‌ను
పదేపదే చేతివేళ్ళతో తడుముతూ
సన్నటి చిరునవ్వుల మెరుపులను
కనుల నిండా నింపుకున్నాడతడు.

ఇంకొద్దిసేపట్లో అతడిలోని విరహం
మధురక్షణాలను తాకనున్నదేమో!
అతడి తనువంతా హాయిగా నవ్వుతూ
తన్మయత్వంతో నాట్యాలాడుతున్నట్లుంది.
అతడి గుండెవేగం మరింత జోరుగా
రైలు బండి పరుగులాగ ఉరకలేస్తుంది.

అతడి ఆశ ఒక్కటే,
సెలయేటి గొంతులో గులకరాళ్ళ
చప్పుడిలా..
ఆమె ఒడిలో ఒదిగిపోవాలని!

Sunday, November 16, 2014

మేఘాలు రాసిన కవిత
నీలి రంగు కాగితంపై
గజిబిజిగా గీసిన బొమ్మల్లా
ఆకాశం నిండా పరుచుకున్న
శ్వేతవర్ణపు మేఘాలు.

ఒకదానితో మరొకటి
పెనవేసుకుపోతూ విడివడుతూ
గుంపులు గుంపులుగా
సాగిపోతున్న మేఘాలు.

పెద్ద పెద్ద జంతువుల
ఆకారాన్ని మింగినట్లుగా
గమ్మత్తుగా కనబడుతున్న
ఎగుడూదిగుడూ మేఘాలు.

కొండల పైట చాటుకు
మెల్లగా ఒదుగుతున్న
సూరీడి వెలుగుతో పాటుగా
మాయమవుతున్న మేఘాలు.

నాలో కవిత్వాన్ని
కరిగించి
చీకటిలో కలిసిన మేఘాలు.


Sunday, November 2, 2014

మౌనప్రణయరాగం


నువ్వెదురుగా లేనప్పుడు

అద్భుతమైన కర్ణాటక సంగీతంలా 
హాయిగా, చాలా నెమ్మదిగా 
సాగిపోతుందీ గమ్మత్తైన కాలం.

ఎన్నో ఆశలు రాల్చే చూపులతో

కలలను వెదుకుతూ ఎదురుచూస్తాను.

ఆ అద్వైత క్షణాలన్నీ

నీ జ్ఞాపకాలలో కలిసిపోతుంటే
నన్ను నేను కోల్పోయి
నీ ఊహలలో వెదుకుతుంటాను.

నువ్వొస్తావు,

మన ఇరువురి మధ్య
ఏవేవో కబుర్లు దోబూచులాడతాయి.
నీ దగ్గరున్న నవ్వుల నురగను
నా పెదాలపై అందంగా అంటిస్తావు.

అదేంటో మరి అర్ధం కాదు!

నీ సాంగత్యంలో ఎంత సమయమైనా
మంచుబిందువులా ఇట్టే కరిగిపోతుంది.

నువ్వు తిరిగి వెళ్తునప్పుడు

ఆగీ ఆగీ విడివడుతున్న
నీ అరచేతి వేళ్ళని చూస్తూ..
ఎన్ని ఊసులు ఛిద్రమవుతాయో!
మరెన్ని స్వప్నాలు శిధిలమవుతాయో!!

మౌనప్రణయరాగం మళ్ళీ 
నా మదిలో మొదలవుతుంది...

Sunday, October 19, 2014

వెన్నల సంతకం

 

రాతిరి వేళ ఆకాశమంతా
విరబూసిన చుక్కలు కురిపించే
పసిడి వెలుగులలో తడుస్తున్నప్పుడు
అనుభూతుల వేణువేదో
కొంగొత్త సంగీతాన్ని ఆలపిస్తుంది.

అలాంటప్పుడు,

ఆ మధుర క్షణాల మీద
మనసు పయనం సాగిస్తూ..
స్వప్న లోకంలోకి జారిపోతుంది.

ఎప్పుడూ గీయని కలల చిత్రమేదో
వెన్నల హంగుతో
రంగుల్ని అద్దుకుంటుంది.

ఎన్నడూ వినని వెన్నల  పాటేదో
మనసు గొంతులో
హాయిగా పాడుకుంటుంది.

చీకటి గూటిలో దీపంలా
వున్న చందమామను చూస్తూ...
ఎన్నో అనుభవాల్ని తడుముతూ..
మనసు తుమ్మెదలా ఎగురుతుంది.

ఆ తుమ్మెద ఝుంకారమే
నా మనసుపలికే మౌనరాగం.
ఎన్నటికీ చెరగని వెన్నల సంతకం.
 

Wednesday, September 3, 2014

మళ్ళీ మళ్ళీ


 
పసితనపు చెట్టుకొమ్మకు వ్రేలాడదీసిన
తీపి జ్ఞాపకాల ఊయలపై
హాయిగా ఊగుతున్న నా మనసుపై
ఎన్నో కలలు హత్తుకుపోతున్నాయి.

నిదురపోయే వేళకి
ఆరుబయటున్న నానమ్మ మంచంలోకి
వాలిపోయి కథలు చెప్పిచ్చుకున్న
మరెన్నో రాత్రుల గురుతులు
నా మనసును వెంటాడుతున్నాయి.

ఆకాశంలో చుక్కల్ని లెక్కిస్తున్నప్పుడు
ఎంతో ఆశను నింపుకున్న
ఆ అమాయకపు చూపుల్లోని కాంతులు
ఇంకా నాలో వెలుగుతూనే వున్నాయి.

"ఈ అనుభూతులన్నీ అందమైన బాల్యాన్ని
తిరిగి తీసుకు రాలేకపోవచ్చేమో! కానీ,
అప్పటి లేలేత అనుభవాలన్నింటినీ 
మళ్ళీ మళ్ళీ మన మనోలోకాల్లోకి తెస్తుంటాయ"ని,
గోడపై  పూలదండేసున్న ఫొటోలోంచి
నానమ్మ నవ్వుతూ చెబుతున్నట్లనిపిస్తుంది.
 

Friday, August 29, 2014

కాగితపు పడవలుచినుకూ చినుకూ కలిసి,
చినుకుపై చినుకు పడుతూ,
చినుకుతో చినుకు పోటిపడుతూ,
ధారలు ధారలుగా ఏకమై,
మళ్ళీ మళ్ళీ కలుస్తూ విడిపోతూ,
ఈ భువిని తనివితీరా ముద్దాడుతూ,
నింగికి నేలకూ మధ్య వారధియై
వాటిని కలుపుతూ,
ఒక అందమైన చిత్రాన్ని
నా కనుల ఎదుట గీస్తున్న వర్షం.


అంతేకాదు,
ఈ అందమైన దృశ్యానుభూతులు

నా మనసున ఏ మూలనో దాచిపెటుకున్న
ఎన్నో జ్ఞావకాల దొంతర్లను కదిలిస్తూ,
బాల్యంలోని గురుతులను,
అప్పటి చిలిపితనపు సరదాలనీ,
చినుకుల చిటపటలతో  తట్టిలేపుతుంటే,


వర్షంలో తడుస్తూ చిందాడిన
ఆ ఆనందమైన,అద్భుతమైన క్షణాలను
ఊహిస్తూ నా తనువంతా నవ్వుకుంటుంది.


రంగురంగుల కాగితపు పడవలను
నీటిలో వేసి మురిసిపోతున్న కనులలోని
ఆ మెరుపులు నన్ను ఎన్నటికీ వీడిపోవు.
వర్షపునీటిలో గెంతులు వేస్తున్నపుడు
చేసిన అల్లరి అరుపులు,
ఆ శబ్దాలు నా మనసును వెంటాడటమాపవు.

Saturday, August 9, 2014

హృదయము రాసుకున్న లేఖ


నీతో గడిపిన క్షణాలన్నింటి మీద కాలం,
చక్రాలేసుకుని పరుగులు తీస్తుంటుంది.
నీతో కలిసి పయనించిన ఆ దారుల్లో
ఏవో అనుభూతి గీతాలు వినిపిస్తున్నాయి.


నీ నవ్వులు విరబూసిన వెన్నల రాతిరితో
నాలో గణించలేని నక్షత్రాలను వెలిగిస్తుంటావు.
నీ మనసు కంటున్న కలల పుస్తకంలో
నేను కలాన్నై రాయాలని ఆశ పెడుతుంటావు.


నీ అడుగులు కోరే గమనం నేనై
నా గమ్యం తలచే తీరం నీవై
ప్రణయపు మంత్రలోకాల్లో ఊగిసలాడే 

ఆ క్షణాలకోసం ఎదురుచూస్తూ...


నా హృదయము రాసుకున్న ఈ లేఖ
నీ హృదయానికి చేరేదెన్నడో?
మన గుండెల చప్పుళ్ళు ఒకటయ్యేదెప్పుడో?Saturday, July 19, 2014

మనసులోని అక్షరంమనసులో మెరిసిన మెరుపొక ఆలోచన.
ఆ మెరుపు వెనుక పరుగులుతీసే మనసు
ఏదో రాయాలని.
అంతే కదా!
మనసు ఆలోచనను పుట్టించిది.
ఆలోచన తిరిగి మనసును నడిపిస్తుంది
.

అక్షరాల వెదుకులాటలో
అలసట లేని ప్రయాణం మొదలైంది...
అనుభవాల కుండలో అనుభూతుల్ని మోసుకెళ్తూ.


సేకరించిన అనుభూతులన్నింటిని
దోసిలితో పైకెత్తి  గుండెలకు హత్తుకున్నాను.
అంతే! ఆ క్షణంలో...
అన్నీ అనుభూతులు సిరాలా రూపుదాల్చి
కాగితంపై అక్షరాలుగా జాలువారాయి.


రాసిన దానిని తిరిగి చూశాను.
అపుడు-
కనిపిస్తున్నది అందంగా ముస్తాబయిన అక్షరాలు కావు.
భావుకతపు రంగుల్ని అద్దుకున్న నా మనసు.

Sunday, June 8, 2014

వెన్నల గీతం


విచిత్రమైన తోటలో
ఎన్ని అందమైన పువ్వులున్నాయో!?
లెక్కపెడదామనుకున్నాను. కానీ
నా అలోచనలకు అందడంలేవవి
.

అహ!,ఎలా దోబుచులాడుతున్నాయో!?
కొన్ని  క్షణాల్లో మాయమవుతూ,
మరికొన్ని కొత్తవి విరబూస్తూ,
ఇంకా కొన్ని రాలిపడుతూ,
భలే తమాషాగా ఉన్నాయి.


ఇంతకీ ఇది ఏ తోట?
నింగిలో కురిసే వెన్నల వర్షమా!?
మనసును తడిపే ఆశల గీతమా!?

 

Monday, April 14, 2014

ఆశల పాట


గదిలో నిశ్శబ్దాన్ని నింపుకోని
దీపపు వెలుతూరులో ఉందామె.
కిటికి ఊచల సందుల్లోంచి
ఎవరికోసమో,దేనికోసమో
గుమ్మం వైపే తదేకంగా చూస్తుంది
.

ఆమె చూపులు
ఎన్నో యుగాల నీరీక్షణను
అంటించుకున్నట్లున్నవి.
ఆమె పెదాలపై
కలల తీగల మెరుపులు
స్పష్టంగా కనపడుతున్నాయి.


అదే దృశ్యం...
అలాగే కొనసాగుతూ ఉంది.

ఆమెలో ఆశ మాత్రం ఎప్పటిలాగే.
కొత్త కొత్త కోరికలను పులుముకుంటూ.


ఎందుకంటే ఆమెకు తెలుసు.
ఇరులలోనే కౌముది అందం
తెలుస్తుందని.
ఎడబాటులోనే జ్ఞాపకాల పాటల్ని
మరింత హాయిగా పాడుకోవచ్చని
.

Wednesday, March 19, 2014

అనుభూతి స్వరాలు
ఎక్కడి నుంచొ వచ్చిన మేఘంలా
నా కనుల ఎదుట  వర్షమై కురిశావు.
ఊహల జలపాతంలా ఉప్పొంగి
నాలో ఆశల తీరాన్ని పలుకరించావు.

నీతో వేసిన ప్రతీ అడుగులో
ఎన్నటికీ చెరగని ఆనవాల్లు.

కన్నులు విప్పిన ప్రతీ కలలో
తడిసిపోతున్న  నీ జ్ఞాపకాలు.

తూరుపు వెలుగంటని వెన్నల్లో
వీచె చల్లని గాలిలా
మదిని తాకిన నీ పరిచయంలో
వింటున్నాను
ఎన్నో అనుభూతులు.
మరుపురాని మధుర గీతాలు.

 

Sunday, March 16, 2014

ఆకాశం పంపిన ప్రేమలేఖ!ప్రియమైన అవనికి!

"ఎలా ఉన్నావు?" అనే ప్రశ్నను
రాయలేని ప్రేమలేఖిది.
ఎందుకంటే, నీకు తెలుసు
అనూక్షణం..
నువ్వు నా కనుపాపల్లోనే తూగుతావని.
నీ తలపుల నావలోనే
నా జీవన పయనం సాగుతుందని.

అలాగే,
ఇంకా ఎన్ని యుగాలు...
కాలం ఒడిలో కరిగిపోయినా
మన మధ్యనున్న దూరం మాత్రం
మనల్ని విడిచిపోదు.
పాపం, దానికి తెలియదు.
మన మనసుల మధ్య
తనకు చోటులేదని.

కానీ, ఒక్కోసారి
నా మనసులో విరహగీతం
తాకుతుంటే...
నీ ఆలోచనలు నా ఎదపై
వియోగ భారాన్ని వదిలివెళ్తాయి.
అలాంటప్పుడు
ఇదుగో,ఇలా అక్షరాలు లేని కబుర్లు
చినుకై కరిగి నిన్ను ముద్దాడుతాయి.
అయ్యో!అదంతా సిగ్గె!?
భలే అందంగా ఉంది:):)
మళ్ళీ నా ప్రేమలేఖ పంపేవరకూ
కొంచెం దాచుకో మరి!
ఇక సెలవు కోరుతూ...

ఇట్లు,
నీదైన ఆకాశం.

 

Tuesday, March 11, 2014

అతడు...ఆమె...ప్రేమ...

అతడు
దేని కోసమో
ఆరాటపడుతూ
వడివడిగా
అడుగులేస్తున్నాడు.
దారి పొడువునా
పచ్చగా మెరిసే
పంటపొలాలు.
గోదారమ్మ ఒడ్డుకి
చేరుకోవడానికి
దాటాల్సిన పొలాలు
ఇంకో అయిదు.

ఆమె
కదులుతున్న
అలలవైపు చూస్తూ..
ఆనందాన్ని
అక్కున చేర్చుకొని
ఎవరి కోసమో
ఆతృతగా
ఎదురుచూస్తుంది.

అతడొచ్చాడు.

ఇరువురి మధ్య
నిశ్శబ్ధం.
ఒకరి శ్వాస
ఒకరికి వినిపించేంతగా.

అతడు
తన పెదాలపై
బిగుసుకున్న
మౌనాన్ని దాటి
"నిన్ను ప్రేమిస్తున్నాను."
అని చెప్పేశాడు.

అంతే

ఆమె చిరునవ్వు
చటుక్కున
అతడి కళ్ళల్లో
మెరిసింది.
ఆ మెరుపులో
వారి మధ్య
మిగిలున్న దూరం
ముక్కలయ్యింది.
కలగన్న అనురాగం
ఒక్కటయ్యింది.
 

Sunday, March 2, 2014

ప్రత్యూషం

 
 
 
తూరుపు కొండలను దాటి
మెల్లగా కదిలివస్తున్న సూరీడు,
ఎర్రని కాంతులీనుతూ
ఆకాశమంతా తన అందాన్ని
పరుచుకున్నాడు.

వదిలిపోతున్న చీకటి తెరల్ని
దిగులుగా వీడుతున్న నక్షత్రాలు.

రాతిరి పూదోటలో
అకస్మాత్తుగా ముగించిన
కలల పయనం
నిజం కాదని స్పృహ కలిగాక,
ఆ క్షణం..
ఓ తియ్యని చిరునవ్వు
నా పెదాలను ముద్దాడింది.

' ఈ రోజు' అనే కొత్త లోకానికి
స్వాగతం  పలుకుతూ....
ప్రకృతి ఒడిలొ
అధ్బుతమైన చిత్రంలా
అరవిరిసిన ప్రత్యూషం.
నా చిన్ని మనసులో కూడా.


 

Friday, February 7, 2014

డైరీలో పేజి

 


నక్షత్రపు కాంతుల సౌరభాల్ని
వెదజల్లుతూ పరిమళిస్తున్న రాతిరి,
సాగర తీరపు ఇసుక తిన్నలపై
హత్తుకునే పిల్ల గాలుల ముసుగులో,
తడారని పాదాలతో నేను.

అపుడు-
ఈ సర్వజగత్తును మరిచి
నా అంతరంగములో నేను
ఏకాంతుడినై,
రాలిపడుతున్న అనుభూతుల్ని
మనసు పొరల్లోకి నింపుకున్నాను.

అంతర్లీనంగా
కలల మంచు బిందువులు
కరిగిపోతూ దాహం తీరిస్తే,
వీచె అలల సంగీతాన్ని వింటూ
స్వేఛ్ఛా గీతంలోకి ఒదిగిపొయాను.

కాలం గిర్రున తిరిగింది.
డైరీలో పేజి,
దానిలో అక్షరాలు కూడా మసకబారాయి.
కాని,
నా అనుభవం మాత్రం అలాగే,
         అంతే స్పష్టంగా.