Thursday, November 27, 2014

ఈ క్షణమే తేల్చి చెప్పవా సఖీ...నువ్వు....
వలపు సంకెళ్ళతో ఊహల గువ్వల్ని బంధించి,
నా చిట్టి గుండెగూటిలో నిలుపగల మంత్రగత్తెవు కదా!
అయితే,నాలో నీ జ్ఞాపకాల బలమెంతో చెప్పగలవా?
నాలోని కవ్వింతల తుఫాన్‌ను ఆపగలవా?
నాకు తెలుసు,వాటికి నీ దగ్గర మంత్రాలుండవని.

మరి నీకు తెలుసా..?

నువ్వు నడిపించుకెళ్ళిన దారుల వెంట,
రాలిపడిన అనుభూతుల పూవుల పరిమళమేదో
నా మనసుని ఎన్నటికీ వెంటాడటమాపదని.

నాలో నువ్వేసిన ఆశల పందిరిని,
ఘాడంగా అల్లుకుపోయిన నీ తలపుల తీగలు
కొంగొత్త కోరికలను చిగురిస్తూ ఎప్పటికీ వాడిపోవని.

కానీ,నాలో ఏ మూలనో ఓ చిన్ని సందేహం,
నువ్వు నా ప్రణయగీతాన్ని ఆస్వాధిస్తావో లేదో అని?!

ఈ క్షణమే తేల్చి చెప్పవా సఖీ...

నా ఆకాశమంత ప్రేమలో,
జాబిలమ్మవై వెన్నల వెలుగులీనుతావని!
తోకచుక్కలా నేలరాలిపోవని!!


Saturday, November 22, 2014

ఒక్క ఆశఅతడు ఆకాశాన్ని మింగేసే చూపులతో
వెన్నలను తాగాలని ప్రయత్నిస్తున్నాడు.
రైలు కిటికీ పక్కన కూర్చున్నాతడికి
చలికి వణుకుతున్నట్లున్నాయి నక్షత్రాలు.

అతడి ప్రియసఖి ఆఖరిసారి
జ్ఞాపకంగా ఇచ్చిన కాఫీమగ్‌ను
పదేపదే చేతివేళ్ళతో తడుముతూ
సన్నటి చిరునవ్వుల మెరుపులను
కనుల నిండా నింపుకున్నాడతడు.

ఇంకొద్దిసేపట్లో అతడిలోని విరహం
మధురక్షణాలను తాకనున్నదేమో!
అతడి తనువంతా హాయిగా నవ్వుతూ
తన్మయత్వంతో నాట్యాలాడుతున్నట్లుంది.
అతడి గుండెవేగం మరింత జోరుగా
రైలు బండి పరుగులాగ ఉరకలేస్తుంది.

అతడి ఆశ ఒక్కటే,
సెలయేటి గొంతులో గులకరాళ్ళ
చప్పుడిలా..
ఆమె ఒడిలో ఒదిగిపోవాలని!

Sunday, November 16, 2014

మేఘాలు రాసిన కవిత
నీలి రంగు కాగితంపై
గజిబిజిగా గీసిన బొమ్మల్లా
ఆకాశం నిండా పరుచుకున్న
శ్వేతవర్ణపు మేఘాలు.

ఒకదానితో మరొకటి
పెనవేసుకుపోతూ విడివడుతూ
గుంపులు గుంపులుగా
సాగిపోతున్న మేఘాలు.

పెద్ద పెద్ద జంతువుల
ఆకారాన్ని మింగినట్లుగా
గమ్మత్తుగా కనబడుతున్న
ఎగుడూదిగుడూ మేఘాలు.

కొండల పైట చాటుకు
మెల్లగా ఒదుగుతున్న
సూరీడి వెలుగుతో పాటుగా
మాయమవుతున్న మేఘాలు.

నాలో కవిత్వాన్ని
కరిగించి
చీకటిలో కలిసిన మేఘాలు.


Sunday, November 2, 2014

మౌనప్రణయరాగం


నువ్వెదురుగా లేనప్పుడు

అద్భుతమైన కర్ణాటక సంగీతంలా 
హాయిగా, చాలా నెమ్మదిగా 
సాగిపోతుందీ గమ్మత్తైన కాలం.

ఎన్నో ఆశలు రాల్చే చూపులతో

కలలను వెదుకుతూ ఎదురుచూస్తాను.

ఆ అద్వైత క్షణాలన్నీ

నీ జ్ఞాపకాలలో కలిసిపోతుంటే
నన్ను నేను కోల్పోయి
నీ ఊహలలో వెదుకుతుంటాను.

నువ్వొస్తావు,

మన ఇరువురి మధ్య
ఏవేవో కబుర్లు దోబూచులాడతాయి.
నీ దగ్గరున్న నవ్వుల నురగను
నా పెదాలపై అందంగా అంటిస్తావు.

అదేంటో మరి అర్ధం కాదు!

నీ సాంగత్యంలో ఎంత సమయమైనా
మంచుబిందువులా ఇట్టే కరిగిపోతుంది.

నువ్వు తిరిగి వెళ్తునప్పుడు

ఆగీ ఆగీ విడివడుతున్న
నీ అరచేతి వేళ్ళని చూస్తూ..
ఎన్ని ఊసులు ఛిద్రమవుతాయో!
మరెన్ని స్వప్నాలు శిధిలమవుతాయో!!

మౌనప్రణయరాగం మళ్ళీ 
నా మదిలో మొదలవుతుంది...